పిల్లలు పుట్టట్లేదని మా కూతురిని చంపాడు!

 పిల్లలు పుట్టట్లేదని మా కూతురిని చంపాడు!
  • నీటి సంపులో మహిళ అనుమానాస్పద మృతి 
  • అల్లుడిపై పోలీసులకు మృతురాలి ఫ్యామిలీ ఫిర్యాదు  
  • హత్యా.. ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు  
  • యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకలో ఘటన

సంస్థాన్ నారాయణపురం, వెలుగు : అనుమానాస్పదంగా నీటి సంపులో పడి మహిళ మృతి చెందిన ఘటన  యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఎస్ఐ జగన్ తెలిపిన ప్రకారం.. ఏపీకి చెందిన నాగమణికి సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన మల్లికార్జున్ తో ఐదేండ్ల కింద పెండ్లైంది.  దంపతులు ఏపీలోని మంగళగిరిలో ఉంటుండగా.. ఇంకా వీరికి పిల్లలు కలగలేదు. పుట్టపాకలో  అత్తమామలు కొత్త ఇల్లు నిర్మిస్తుండగా నాగమణి భర్తతో కలిసి వారం కింద వచ్చారు. సోమవారం ఉదయం మామ బట్టల వ్యాపారానికి,   భర్త కొత్త ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంట్లో అత్త, కోడలు ఉన్నారు.

గుడికి వెళ్తామని భర్తను రావాలని చెప్పి అత్తను కొత్త ఇంటి వద్దకు పంపింది. మల్లికార్జున్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్య కనిపించలేదు. స్థానికంగా వెతికినా ఆచూకీ దొరకలేదు. నీటి సంపులో చూడగా నాగమణి డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు వెళ్లి  డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పిల్లలు పుట్టడం లేదని, తమ కూతురిని పంపడంలేదని, ఫోన్లో కూడా సరిగా మాట్లాడనివ్వట్లేదని అల్లుడే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ నారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్ఐ తెలిపారు.